ఒక కథతో తీసిన సినిమా ఒక భాషలో సూపర్‌హిట్ అయితే దాన్ని పలు భాషల్లో రీమేక్ చెయ్యడం అనేది ఎప్పటినుంచో వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ 50వ దశకంలోనే ప్రారంభం కావడం, ఆ సినిమాను పలు భాషల్లో రీమేక్ చెయ్యడం అనేది విశేషంగా మారింది. 1952లో అరుణ్ చౌదరి రాసిన కథతో బెంగాలీలో ‘పేషర్ బరి’ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సుధీర్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సబిత్రి చటర్జీ, భాను బెనర్జీ, అనూప్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్కడ సూపర్‌హిట్ కావడంతో సి.పులయ్య ‘పక్క యింటి అమ్మాయి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ నిర్మించిన ఈ సినిమాలో రేలంగి, అంజలి జంటగా నటించారు. ప్రముఖ నేపథ్యగాయకుడు ఎ.ఎం.రాజా నటించిన ఏకైక సినిమా ఇది. సి.పులయ్య కుమారుడు, ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. అలనాటి అందాల తార దేవిక ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించారు. ఇదే ఆమె నటించిన తొలి సినిమా అని చెప్పొచ్చు. అంతకుముందు పుట్టిల్లు సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేసినప్పటికీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇదే. అప్పట్లో ఆమె పేరు మోహనకృష్ణ. చక్కని హాస్య చిత్రంగా ‘పక్క యింటి అమ్మాయి’ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
1968లో సునీల్‌దత్, సైరా బాను, కిశోర్ కుమార్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ హాస్యనటుడు మెహమూద్ ‘పడోసన్’ పేరుతో ‘పేషర్ బరి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జ్యోతి స్వరూప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఆర్.డి.బర్మన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఇదే కథతో ‘పక్క యింటి అమ్మాయి’ రూపొందిన 30 సంవత్సరాల తర్వాత తెలుగులో ‘పక్కింటి అమ్మాయి’ పేరుతో మరోసారి రీమేక్ చేశారు. చంద్రమోహన్, జయసుధ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కె.వాసు దర్శకత్వం వహించారు. ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ చిత్రంలో ఓ పాటలో తొలిసారి కనిపించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దాదాపు 10 సంవత్సరాల తర్వాత ‘పక్కింటి అమ్మాయి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. రెండోసారి చేసిన ఈ సినిమా కూడా సూపర్‌హిట్ అయ్యింది. చక్రవర్తి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. 1952లో బెంగాలీ భాషలో మొదలైన ఈ సినిమా దాదాపు 30 సంవత్సరాల పాటు రీమేక్ అవుతూ అన్ని భాషల్లోనూ విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు.